న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సాగుతున్న ఆన్లైన్ ప్రచారాలు, నకిలీ న్యాయవాదుల వ్యవహారాలపై సుప్రీంకోర్టులో ఒక ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ సందర్భంగా చీఫ్ జస్టిస్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని, సీజేపీ (CJP) పేరుతో సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ఆన్లైన్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also read: Kesineni Chinni: ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ..!
దీనితో పాటు దేశంలో నకిలీ న్యాయవాదుల డిగ్రీల పైన కూడా సమగ్ర విచారణ జరపాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగజార్చేలా ప్రచారం చేస్తున్నారని న్యాయవాది గోస్వామి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు హాల్లో జరుగుతున్న చర్చలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ రూపంలో ప్రచారం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడేందుకు ఈ వ్యవహారంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also read: Chandrababu: కూటమి రాజ్యసభ రేసు, చంద్రబాబు మార్క్ లెక్కలు..!
అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఆన్లైన్ ప్రచారాలను, వ్యంగ్య క్యాంపెయిన్లను అంత సెంటిమెంటల్‌గా తీసుకోవద్దని న్యాయవాది గోస్వామికి సీజేఐ సూచించారు. ఇలాంటి విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా కోర్టు పేర్కొంది. చివరగా ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని అర్జెంట్ మ్యాటర్‌గా పరిగణించలేమని చెప్తూ పిటిషన్‌ను పక్కన పెట్టారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వ్యంగ్య ప్రచారాలపై కోర్టులు అంతగా స్పందించాల్సిన పనిలేదనే కోణంలో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
