ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే పౌరుల ప్రాథమిక హక్కులను రక్షిస్తూ బొంబాయి హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనలు తెలపడం లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి కారణాలతో ఏ ఒక్క పౌరుడిని నగరం లేదా జిల్లా నుండి బహిష్కరించే (Externment) అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. “భారతదేశ పౌరులు ఎవరూ ప్రభుత్వానికి గులాములు కారు. అలాగే పోలీసులు కూడా ముఖ్యమంత్రులకో, ప్రధాన మంత్రులకో సేవకులు కారు.. వారు ప్రజల సేవకులు” అని జస్టిస్ మాధవ్ జమ్దార్‌తో కూడిన సింగిల్ బెంచ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయీద్ అహ్మద్ అబ్దుల్ వహీద్ చౌదరిని ముంబై మరియు పరిసర జిల్లాల నుండి 12 నెలల పాటు బహిష్కరిస్తూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పూర్తిగా కొట్టివేసింది. చౌదరిపై తీసుకున్న ఈ చర్య పూర్తిగా ద్వేషపూరితమైనదని (Malafide) న్యాయస్థానం అభివర్ణించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 21 ప్రకారం.. దేశంలోని ప్రతీ పౌరుడికి తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కుతో పాటు గౌరవంగా జీవించే హక్కు కూడా ఉందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.
సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA), ఎన్‌ఆర్‌సీ (NRC), మరియు వక్ఫ్ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా చౌదరి ధర్నాలు, మోర్చాలు నిర్వహించారని.. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయనే నెపంతో పోలీసులు ఈ బహిష్కరణ శిక్ష విధించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. “ఇటీవల దేశంలో నీట్ (NEET) పేపర్ లీక్‌పై కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి, మరి ఆ నిరసనకారులందరిపైనా ఇలాంటి బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేస్తారా?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేకాదు, “పిటిషనర్ తనపై ఉన్న కేసులు పోవాలంటే అధికార పార్టీలోకి మారాలా? ఆయన కూడా పార్టీ మారితే ప్రభుత్వ ‘వాషింగ్ మెషిన్’ ద్వారా కేసులు క్లియర్ అవుతాయి కదా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం హార్స్ ట్రేడింగ్ ఇలాగే నడుస్తోంది” అంటూ కోర్టు రాజకీయ పరిణామాలపై అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించింది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి