తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు బీఆర్ఎస్ (BRS) పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఒక పార్టీ కార్యకర్త పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన.. పొలిటికల్ సర్కిల్స్ షేక్ అయ్యేలా మాట్లాడారు. “నేను బీఆర్ఎస్‌కు కొద్దిగా దూరం కాగానే.. జనాలు, కార్యకర్తలు నన్ను అప్పుడే మర్చిపోతున్నారు. నేను పాత మల్లారెడ్డినే కదా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తానే స్వయంగా పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటించడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘తెలంగాణ భవన్’ వైపు ఆయన కన్నెత్తి కూడా చూడటం లేదని సమాచారం. గులాబీ బాస్ కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించే కీలక సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. తాను పార్టీ మారుతున్నాననే సంకేతాలను బలంగా పంపించడానికే మల్లారెడ్డి ఈ రకమైన వ్యూహాత్మక దూరాన్ని పాటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మల్లారెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన కోడలు ప్రీతిరెడ్డి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలవడం, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించడం కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. గతంలోనూ ఆయన బీజేపీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు పొలిటికల్ టాక్. కేవలం విద్యాసంస్థల రక్షణ కోసమే కాకుండా, తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే మల్లారెడ్డి కమలం గూటికి చేరేందుకు రూట్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి