అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో భారత్‌లో వాణిజ్యపరమైన (కమర్షియల్) ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు రూ. 1,884 గా ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం ఏకంగా రూ. 3,100 మార్కుకు చేరుకుంది. ఈ ఆకస్మిక ధరల పెంపు వల్ల ఎల్పీజీ ఇంధనంపై ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు లండ్రీలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) తీవ్ర ఆర్థిక భారానికి గురవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు మరియు ఇంధన వృధాను అరికట్టేందుకు భారతదేశపు మొట్టమొదటి ‘ఎల్పీజీ ఎఫిషియెన్సీ పాలసీ ఫ్రేమ్‌వర్క్’ను తీసుకురావాలని పుణే గ్యాస్ (Pune Gas) అనే ప్రముఖ ఇంధన సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఆ సంస్థ లేఖ రాసింది. ఇప్పటివరకు భారతదేశం కేవలం ఎంత గ్యాస్ దిగుమతి చేసుకున్నాం, ఎంత సరఫరా చేశాం అనే కోణంలోనే చూసిందని, కానీ ఉన్న ఇంధనాన్ని ఎంత సమర్థవంతంగా వాడుతున్నామనే దానిపై ఒక స్పష్టమైన జాతీయ విధానం అవసరమని కంపెనీ సీఈఓ జేసల్ సంపత్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఈ ప్రతిపాదిత పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా కమర్షియల్, ఇండస్ట్రియల్ రంగాలలో వృధాను తగ్గించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సాధారణ సిలిండర్ల కంటే పెద్దవైన 47.5 కేజీల ఎల్ఓటీ (LOT) సిలిండర్లను ప్రోత్సహించాలని కోరారు. ఇవి ఇంధన భద్రతను, నాణ్యతా ప్రమాణాలను పెంచడమే కాకుండా దొంగతనాలను అరికడతాయని పేర్కొన్నారు. దీనితో పాటు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో తాము స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘ఎల్పీజీనియస్‘ అనే మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఇండస్ట్రీలలో ఇంధన వినియోగాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయవచ్చో కూడా వివరించారు. ఇంధన వృధాను నివారించడం ద్వారా నిర్వహణ వ్యయం తగ్గి, జాతీయ డిమాండ్ నియంత్రణలోకి వస్తుందని ఈ పాలసీని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి