ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసి వరుస అరెస్టులతో జైలు పాలైన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ చుట్టూ రాజకీయం వేగంగా మారుతోంది. గత ఐదు రోజులుగా వరుస బెయిళ్లు, మళ్లీ వెనువెంటనే అరెస్టులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రావణ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇప్పుడు పూర్తిగా పక్కనబెట్టేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం అతనిని వాడుకుని, తీరా సమస్యల్లో పడేసరికి వైసీపీ నాయకత్వం హ్యాండ్ ఇచ్చిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం యూఏపీఏ సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులతో ఇరుక్కుపోయిన రావణ్‌కు వైసీపీ నుండి ఆశించిన స్థాయిలో న్యాయ సహాయం అందడం లేదని సమాచారం. ప్రారంభంలో కొందరు లాయర్లు కోర్టుల్లో వాదించినప్పటికీ, కేసు తీవ్రత దృష్ట్యా మరియు గమన, ఇంద్రసేన చౌదరిల విచారణతో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లింకులు బయటకు రావడంతో వైసీపీ నేతలు డిఫెన్స్‌లో పడ్డారు. గమనతో సహా పలువురు కీలక వ్యక్తులను పోలీసులు గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో గంటల తరబడి విచారిస్తుండటంతో, ఎక్కడ తమ పేర్లు బయటకు వస్తాయోనన్న భయంతో వైసీపీ ముఖ్య నేతలు రావణ్ వ్యవహారం నుండి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా మరియు రాజకీయ సర్కిళ్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘ప్రశ్న రావణ్‌కు, మా పార్టీకి ఎలాంటి అధికారిక సంబంధం లేదు.. అతను స్వతంత్రంగానే వీడియోలు చేసుకున్నాడు’ అనే రేంజ్‌లో వైసీపీ అంతర్గతంగా లీకులు ఇస్తోంది. వైసీపీ నేత ఇంద్రసేన చౌదరి ఉచితంగా ఫ్లాట్, ఆర్థిక సాయం అందించినట్లు పోలీసులు గుర్తించినప్పటికీ, అది వ్యక్తిగత సాయమే తప్ప పార్టీకి సంబంధం లేదనే ధోరణిని వ్యక్తపరుస్తున్నారు. కేసుల చట్రంలో ఇరుక్కుని వరుస అరెస్టులు ఎదుర్కొంటున్న తరుణంలో, నమ్ముకున్న పార్టీనే న్యాయ సహాయం విషయంలో గాలికొదిలేయడంతో రావణ్ వర్గం తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో చర్చ నడుస్తోంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి