వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన తన కుమారుడిని చట్టం నుండి రక్షించేందుకు తప్పుడు సమాచారంతో నాటకమాడారనే ఆరోపణలపై అప్పలరాజుపై పోలీసులు ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులను, వ్యవస్థలను తప్పుదారి పట్టించేలా ఆయన వ్యవహరించిన తీరుపై విచారణ ముమ్మరం కావడంతో, త్వరలోనే సీదిరి అప్పలరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జిల్లా రక్షణ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ వివాదానికి సంబంధించిన తాజా వివరాల ప్రకారం, గత శుక్రవారం రాత్రి కాశీబుగ్గ సమీపంలో మాజీ మంత్రి పెద్ద కుమారుడు ఆరవ్ వర్మ అతివేగంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న గొర్రెల కాపరి దుబ్బ దానయ్యను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దానయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, ఆరవ్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అప్పలరాజు.. గాయపడిన తన కుమారుడిని గుట్టుచప్పుడు కాకుండా కారులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసుల విచారణ నుంచి కొడుకును తప్పించేందుకు, బైక్ నడిపింది ఆరవ్ కాదని, తన ప్రధాన అనుచరుడు సిద్ధార్థ్ అంటూ నేరాన్ని వేరొకరిపైకి నెట్టేందుకు పక్కా ప్లాన్ వేశారు.
తొలుత అనుచరుడిపైనే కేసు నమోదైనప్పటికీ, స్థానికుల నిరసనలు మరియు పెట్రోల్ బంక్, రోడ్డు మార్గాల్లో లభించిన స్పష్టమైన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా బైక్ నడిపింది మాజీ మంత్రి కుమారుడేనని పోలీసులు తేల్చారు. దీంతో అన్ని దారులూ మూసుకుపోవడంతో సోమవారం రాత్రి ఆరవ్ వర్మ పోలీసుల ఎదుట లొంగిపోగా, కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, ప్రమాదం జరిగిన రోజు రాత్రి నుంచే నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూసినందుకు గానూ సీదిరి అప్పలరాజుపై కూడా పోలీసులు సీరియస్ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. జిల్లా ఎస్పీ నుంచి ఉన్నతాధికారులకు అందిన తాజా నివేదికల ఆధారంగా, తప్పుదారి పట్టించిన నాటకంలో ప్రధాన సూత్రధారి అయిన అప్పలరాజుపై ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి