బొండా అంతర్యం ఏంటీ..? ఎందుకు ఎదురు తిరిగినట్టు..?

బిగ్ ప్లాన్ తో నడుస్తోన్న బొండా..?

Share this :

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అలియాస్ బొండా ఉమ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. గత ఐదేళ్ల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కరడుగట్టిన శత్రుత్వంలా పోరాడిన బొండా ఉమ, హఠాత్తుగా అదే వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అత్యంత తీవ్రంగా పరిగణించారు. ఇందులో భాగంగానే సీఎం ఆదేశాల మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేడు బొండా ఉమ నుంచి అధికారికంగా వివరణ తీసుకోనున్నారు.

Also Read: పిఠాపురంపై గురి పెట్టిన పవన్.. కీలక ఆదేశాలు..!

ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా నివేదికను తయారు చేసి చంద్రబాబుకు సమర్పించనున్నారు. అయితే, అసలు బొండా ఉమ ఆలోచన ఏమై ఉంటుంది..? కఠినమైన హెచ్చరికలు ఉన్నా ఆయన అలా ఎందుకు వ్యవహరించారు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. బొండా ఉమ ఆలోచన కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బయటకు వచ్చి.. కాపు నాయకుడిగా మారాలనే ఆలోచనలో ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.

ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంలో తనకు ఉన్న తన పట్టును కాపాడుకోవడానికి మరియు స్థానికంగా ఉన్న అన్ని వర్గాల మద్దతును సమతుల్యం చేసుకోవడానికి ఆయన ఈ వ్యూహాన్ని అమలు చేసి ఉండవచ్చు. ప్రత్యక్షంగా రాజకీయ వైరం ఉన్నప్పటికీ, కొన్ని సామాజిక కార్యక్రమాలు లేదా స్థానిక వేదికల ద్వారా ప్రత్యర్థులతో సత్సంబంధాలు కలిగి ఉండటం ద్వారా భవిష్యత్తులో తన రాజకీయ పునాదికి ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవాలనేది ఆయన వ్యక్తిగత ఆలోచన అయి ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది.

పార్టీ లైన్ కంటే స్థానిక అవసరాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ, టీడీపీ అధిష్ఠానం ఆలోచనలు వేరేలా ఉన్నాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు, అక్రమ కేసులు, వేధింపులను చంద్రబాబు నాయుడు మరిచిపోలేదు. అందుకే, గతంలోనే వైసీపీ నేతలతో ఏ ఒక్క టీడీపీ నేత కూడా వేదికలు పంచుకోకూడదని, ఎలాంటి మైత్రి ప్రదర్శించకూడదని పార్టీ హైకమాండ్ అత్యంత స్పష్టమైన, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ప్రధాన్ తర్వాత సీజేపి నెక్స్ట్ టార్గెట్ ఆయనేనా..?

ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సామాన్య కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని అధిష్ఠానం భావిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం వైసీపీ అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే, మరోవైపు సీనియర్ నేతలు ఇలా వేదికలు పంచుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని చంద్రబాబు భావించడం వల్లే ఈరోజు నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాస్‌ లను రంగంలోకి దించి బొండా ఉమపై ఈ సీరియస్ యాక్షన్‌కు ఆదేశించారు.