పిఠాపురంపై గురి పెట్టిన పవన్.. కీలక ఆదేశాలు..!

ఋణం తీర్చుకోనున్న పవన్

Share this :

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అమరావతి వేదికగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన పనులను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, కార్యాలయ సిబ్బంది స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Also Read: సాయి పల్లవి రెమ్యునరేషన్ వింటే మైండ్ బ్లాక్..!

నియోజకవర్గ పరిధిలో మంజూరైన 288 సిమెంట్ రోడ్ల నిర్మాణ నాణ్యతపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆరా తీశారు. రహదారుల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడకూడదని, నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు స్థానికంగా ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న నాగులాపల్లి తాగునీటి పథకం పురోగతిపై సమీక్షించారు. ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

Also Read: ప్రధాన్ తర్వాత సీజేపి నెక్స్ట్ టార్గెట్ ఆయనేనా..?

నియోజకవర్గంలోని రైతాంగానికి అండగా నిలుస్తూ, సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్యం, పారిశుధ్యంపై డిప్యూటీ సీఎం అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అలాగే, నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిపాదించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణంతో పాటు, సంస్కృతి, ఆధ్యాత్మికతను పెంపొందించేలా చేపట్టనున్న 100 భజన మందిరాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.