బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించలేదు. ఆయన జీవితంలోని అత్యంత వివాదాస్పద ‘కృష్ణజింకల వేట’ (Blackbuck Poaching Case) కేసు నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘కాలా హిరన్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సల్మాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తక్షణ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. బుధవారం జరిగిన విచారణలో సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన రిజాండర్ రికార్డుల్లో లేకపోవడాన్ని గమనించిన జస్టిస్ జ్యోతి సింగ్.. ఈ కేసు తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేశారు.
కోర్టు విచారణ అనంతరం ఈ చిత్ర నిర్మాత అమిత్ జానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ వేదికగా సల్మాన్ ఖాన్‌కు గట్టి సవాల్ విసిరారు. కోర్టుకు స్టార్ గానీ, గ్లామర్ గానీ ముఖ్యం కాదని.. చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. “తమను తాము బాలీవుడ్‌కు బాస్ అని చెప్పుకున్నంత మాత్రాన ‘కాలా హిరన్’ సినిమా ఆగిపోదు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఏకంగా 8,000 థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అంటూ అమిత్ జానీ ధీమా వ్యక్తం చేశారు.
కోర్టు పరిణామాల ప్రకారం.. ఈ చిత్రం ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పరిశీలనకు లేదా సర్టిఫికేషన్ కోసం వెళ్లలేదు. సినిమా విడుదలైతే కోలుకోలేని నష్టం జరుగుతుందని, వెంటనే తగిన ఆదేశాలు ఇవ్వాలని సల్మాన్ ఖాన్ తరఫు సీనియర్ కౌన్సిల్ కోర్టును కోరారు. అయితే చిత్ర యూనిట్ తరఫు లాయర్ స్పందిస్తూ.. వచ్చే సోమవారం (జూలై 6) కోర్టు విచారణ ముగిసేంత వరకు ఈ చిత్రాన్ని సెన్సార్ సర్టిఫికేషన్ కోసం సీబీఎఫ్‌సీకి పంపబోమని కోర్టుకు హామీ ఇచ్చారు.
1998లో జరిగిన కృష్ణజింకల వేట కేసు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత, సినీ జీవితంలో అతిపెద్ద చట్టపరమైన వివాదం. ఇప్పుడు సరిగ్గా అదే అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని అమిత్ జానీ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో బాలీవుడ్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సినిమా తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ సల్మాన్ చట్టపరమైన పోరాటానికి దిగినప్పటికీ, కోర్టు నుండి తక్షణ ఉపశమనం లభించకపోవడంతో జూలై 6న జరగబోయే తదుపరి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి