రిటైర్డ్ అధికారి అంటే ఎందుకు సార్ అంత ముద్దు..?

Share this :

ఆ రిటైర్డు ఐఏఎస్ పైన అంత ఆపేక్ష ఎందుకు ముఖ్యమంత్రి గారు..? అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వినిపిస్తున్న మాట. సచివాలయంలో ఆ శాఖకు ఆ రిటైర్డు ఐఏఎస్ అధికారి తప్ప మరో ఐఏఎస్ అధికారి లేరని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. నిజమే అనిపిస్తుంది. సచివాలయంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న విద్యుత్ శాఖ అంటే విద్యుత్ శాఖకు దత్తపుత్రుడిగా ప్రచారం వున్న సీనియర్ రిటైర్డు ఐఏఎస్ అధికారి విజయానంద్‌కు అప్పుడు.. ఇప్పుడు కూడా అదృష్టం బాగా కలిసొస్తూనే వుంది.

Also Read: కెనడాలో భారత విద్యార్థులకు వర్క్ పర్మిట్ షాక్..!

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంలో.. మళ్లీ కూటమి ప్రభుత్వంలో కూడా విజయానంద్ మాత్రమే విద్యుత్ శాఖకు దిక్కయ్యారు. ప్రభుత్వాలేమో విజయానంద్ పై ఆధారపడుతుండగా.. ఆయన మాత్రం.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి పైన ఆధారపడుతుంటారట. పేరుకే ఈ శాఖకు మంత్రి ఉంటారు. పెత్తనం చేసేది అంతా విజయానంద్‌తో పాటు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. సీఎంలు మారినా సరే.. ఈ ఇద్దరు అప్పుడు.. ఇప్పుడు అక్కడే తిష్ఠ వేశారు. అంతా వందల కోట్ల ప్రభావమే అనే ప్రచారం కూడా ఉంది.

ఇక అసలు విషయానికోస్తే.. విద్యుత్ శాఖ శాఖాధిపతిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన విజయానంద్ సర్వీస్ నుండి రిటైర్ అయినా కూడా.. ఆయన సర్వీస్ పొడిగించారు సీఎం చంద్రబాబు. పొడిగించిన సర్వీస్ కూడా పూర్తి అయ్యింది. అయినా సరే.. విజయానంద్‌ను సీఎంఓ ఇన్‌ఛార్జ్ అధికారిగా, విద్యుత్ శాఖాధిపతిగా నియమించిన ఘనత చంద్రబాబుకే దక్కింది. ఇటీవల కాలంలో విజయానంద్ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. డాక్టర్లు ఇంకా బెడ్ రెస్ట్ అవసరమని చెప్పినా కూడా చంద్రబాబు మాత్రం.. విజయానంద్ తిరిగి కోలుకుంటారు.. విద్యుత్ శాఖాధిపతిగా మళ్లీ వస్తారు.. అని సన్నిహితులకు చెబుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: జోగి రమేష్ ను వదిలేశారా..?

విద్యుత్ శాఖను నిర్వహించగల సమర్థవంతమైన ఐఏఎస్ అధికారి మరొకరు లేరా అనే ప్రశ్న కూడా బాగా వినిపిస్తోంది. నిజానికి విజయానంద్‌ను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఇప్పటికే సూచనలు చేశారు. అయినా సరే.. చంద్రబాబు మాత్రం.. మళ్లీ విజయానంద్‌ వస్తారని చెప్పడం వెనుక మతలబు ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. విజయానంద్ వచ్చే వరకు విద్యుత్ శాఖకు ఇంఛార్జ్‌ను కూడా ఇప్పటి వరకు నియమించలేదు. అంటే అధికారే లేరు. దీంతో చంద్రబాబు తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానే సీఎంగా ఉండాలని.. విద్యుత్ శాఖాధిపతిగా విజయానంద్ మాత్రమే ఉండాలని చంద్రబాబు కొరికేమో.. అని సెటైర్లు వేస్తున్నారు.