అయ్యో పాపం.. వైసీపీ నేత, మాజీ మంత్రి.. కాపు టైగర్ అని చెప్పుకునే అంబటి రాంబాబుకు ఇంటా, బయట అవమానాలు ఎదురవుతున్నాయి. ముద్రగడ పద్మనాభ రెడ్డి తర్వాత కాపు సామాజిక వర్గాన్ని ఉద్దరించే బాధ్యతను తాను తీసుకున్నట్లుగా అంబటి తెగ ఫీల్ అవుతున్నారు. అందుకే ఆయనకు ఆయనే కాపు కులం టైగర్ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అంబటి చేస్తున్న వ్యాఖ్యలు, కామెంట్లపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చివరికి సొంత పార్టీ నేతలు కూడా అంబటి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక వైపు కాపు టైగర్ అంటూనే.. మరో వైపు జగన్ మోహన్ రెడ్డిని తనకు ఓపిక ఉన్నంత కాలం భుజాలపై మోస్తామని చెబుతున్నారు. అంటే.. పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తానంటున్నారా.. అనేది ఇప్పుడు అంబటికి ఎదురవుతున్న ప్రశ్న.
కాపు టైగర్ ఏమిటీ.. జగన్ రెడ్డికి ఊడిగం చేయడం ఏమిటనేది ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్న ప్రశ్నలు. అపార రాజకీయ అనుభవం ఉన్న అంబటి వేసే తప్పటడుగులే ఏదో ఒక రోజు ఆయన రాజకీయ ఎదుగుదలకు అడ్డం అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసల విషయం ఏమిటంటే.. రాజకీయాల్లో కొన్ని నైతిక విలువలను ఎవరైనా తప్పకుండా పాటించాల్సిందే. “అంబటి రాంబాబు మాదిరిగా నేను మాట్లాడలేను కదా..” అని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాహాటంగానే కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు పరోక్షంగా అంబటిని అవమాన పరిచినట్లే కదా అనేది పార్టీ నేతల మాట.
ఇక అంబటి గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో ఆయన గంట, అరగంట, సంజన, సుకన్య అంటూ ఆడియో కాల్, సంక్రాంతికి సంబరాల రాంబాబు డ్యాన్స్, పోలవరం ప్రాజెక్టుపైన నాకే ఏమీ తెలియదు అనే మాటలు.. గోదావరి నదిపైన పులిచింతల బ్యారేజ్ అనే మాటలు ఇప్పటికే అంబటి పరువును బజారున పడేశాయి. వీటికి తోడు పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనను తలెత్తుకోకుండా చేసినట్లున్నాయి. వయో భారం, అనారోగ్యంతో కాలం చేసిన ముద్రగడ పద్మనాభ రెడ్డి మరణాన్ని కూడా రాజకీయం చేసేందుకు అంబటి బాగా ప్రయత్నించారు. పోలీసు గౌరవ వందనం విషయంలో అంబటి వ్యవహరించిన తీరుపై కాపు సామాజిక వర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి.
ఒక మనిషి మరణించిన తర్వాత.. కుటుంబంలో ఎన్ని విభేదాలున్నా సరే.. రక్త సంబంధీకులు వచ్చి చూస్తారు. ముద్రగడ మరణించిన తర్వాత ఆయన కుమార్తె క్రాంతి కూడా అలానే వచ్చారు. అయితే క్రాంతిని తండ్రి శవం దగ్గరకు కూడా రానివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో తల్లి విజయలక్ష్మి, కొడుకు వైఎస్ జగన్, కుమార్తె వైఎస్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలున్నాయి. తల్లి, కూతురు ఒక వైపు ఉంటే.. కొడుకు, కోడలు మరో వైపు ఉన్నారు. అయినా సరే.. వైఎస్ఆర్ జయంతి, వర్థంతి రోజుల్లో ఆయన సమాధి దగ్గరకు కుటుంబ సభ్యులంతా వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. విజయలక్ష్మి, జగన్, షర్మిల, భారతీ రెడ్డి కూడా మాట్లాడుకోకపోయినా సరే.. ఒకే వేదికపై ఉంటారు.
వైసీపీ నేతల విషయంలో అది తప్పుకాదు. అదే వైసీపీ నేతలు ముద్రగడ చనిపోయిన తర్వాత చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని అడ్డుకోవటం ఎంత వరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రశ్న. నిజానికి జగన్ పైన షర్మిల ఎన్నో ఆరోపణలు చేశారు. ఆస్తి ఇవ్వకుండా మోసం చేశారని.. బాబాయ్ హంతకులను కాపాడుతున్నారని.. అలాగే రాజకీయ విమర్శలు కూడా చేశారు.. చేస్తున్నారు కూడా. అక్కడ షర్మిల తీరులో ఎలాంటి తప్పు లేదంటున్న వైసీపీ నేతలు.. ముద్రగడ కుమార్తె క్రాంతిని మాత్రం తప్పుబడుతున్నారు. అంతే కాదు.. “నేను వైఎస్ కుటుంబానికి సేవ చేస్తాను.. జగన్ మోహన్ రెడ్డిని తన భుజాలపై మోస్తాను..” అని బాహాటంగానే చెబుతున్నారు అంబటి రాంబాబు.
అప్పుడేమో వైసీపీ మాజీ మంత్రి, మరో కాపు నేత పేర్ని నాని.. “నేను జగన్ మోహన్ రెడ్డికి పాలేరును” అన్నారు. ఇప్పుడేమో కాపు టైగర్ అని తనకు తానే బిరుదు ఇచ్చుకున్న అంబటి రాంబాబు కూడా పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డికి పాలేరు అని చెప్పుకుంటున్నారు. వైసీపీలో కాపు నేతల వల్లే వైసీపీని అభిమానించే కాపులు కూడా తాజాగా ఆ పార్టీకి పూర్తిగా దూరమవుతున్నారు. ఇప్పటికైనా అంబటిని కంట్రోల్ చేసి, పార్టీకి దూరంగా పెట్టకపోతే.. ఐదు జిల్లాల్లో వైసీపీకి పట్టుమని పది సీట్లు కూడా రావని వైసీపీ నాయకులే ఆఫ్ ది రికార్డుగా కామెంట్లు చేస్తున్నారు.
