తాజా వార్తలు

Nellore: భార్య పదవి కోసం.. మంత్రి పదవినే భర్త త్యాగం చేశారా..?

తెలుగు రాజకీయాల్లో చక్రం తిప్పగల నేత

Share this :

ఆయనకు భార్య అంటే ఎంత ప్రాణమో, ఎంత ఇష్టమో ఆ జిల్లాలోనే కాదు.. రాష్ట్రమంతా తెలుసు. ఆమెకు పదవి కోసం ఏకంగా ఆయనకు అటు పార్టీ పెద్దలు, ఇటు కేంద్ర పెద్దలు ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి పదవి ఆఫర్‌నే త్యాగం చేశారంట సదరు ఎంపీ గారు. వేల కోట్ల ఆస్తులు. కానీ ఆ ఎంపీ గారికి ఉన్న కోరిక మాత్రం ఒకటే. ఆ కోరిక ఏమిటంటే.. తన భార్యను మంత్రిగా చూడాలని. ఆమెను మంత్రిగా చూడాలనుకుంటున్నట్లు తన సన్నిహితుల వద్ద ఇప్పటికే చాలా సార్లు చెప్పారు కూడా. అందుకే తనకు అవకాశం వచ్చినా సరే.. కాదని.. ఆ పదవేదో తన భార్యకు ఇవ్వాలని కోరుతున్నారట.

వేల కోట్ల ఆస్తులు.. వ్యాపారాలు.. అంతర్జాతీయ స్థాయిలో పరిచయాలు.. తెలుగు రాజకీయాల్లో చక్రం తిప్పగల నేత.. అన్ని పార్టీల నేతలతో చక్కటి సంబంధాలు. ఆయన కావాలనుకుంటే.. ఏదైనా సరే సాధించగల సమర్థులు కూడా. అందుకే అందుకే తనకు మంత్రి పదవి ఆఫర్ వచ్చినా కూడా.. ఆ ఆఫర్ తిరస్కరిస్తూ, తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారని ఆయన వర్గీయులే ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పదవిలో ఉంటే వేల కోట్ల విలువైన తన వ్యాపారాలకు అంతరాయం వస్తుందేమో అనే అనుమానం ఆ ఎంపీకి ఉందేమో అంటున్నారు సన్నిహితులు. అంతే కాదు ఎలాగూ కేంద్ర క్యాబినెట్ పదవి తనకు ఇవ్వరు. సహాయమంత్రి పదవి మాత్రమే ఇస్తారు. కేంద్రంలో సహాయ మంత్రి పదవంటే.. ఏ పనులు ఉండవు. ఆ శాఖకు సంబంధించిన ఫైళ్లు కూడా రావు.

కేంద్ర సచివాలయంలో మాత్రం కార్యాలయం ఇస్తారు. కలిసేందుకు పిలిచినా అధికారులు పట్టించుకోరు.. ఖాతరు కూడా చేయరు. పైగా గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలు ఆయనకు చాలానే ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి పదవితో ఎలాంటి అధికారాలు ఉండవు. దాని కంటే ఎంపీగా ఉంటేనే కాస్త విలువ ఉంటుందని అనుభవంతో తెలుసుకున్న ఆ టీడీపీ ఎంపీ.. తనకు మంత్రి పదవి వద్దు.. భార్యకు మంత్రి పదవి ఇస్తే.. జిల్లా మొత్తాన్ని కంట్రోల్ చేయగలననే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో సహాయ మంత్రి పదవి తీసుకోమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సీఎం చంద్రబాబు కోరినట్లుగా తెలిస్తోంది.

అయితే తనకు ఇచ్చిన ఆఫర్‌ను వేమిరెడ్డి సున్నితంగా తిరస్కరించారని.. తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వమని చంద్రబాబును కోరినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది ఇప్పుటు నెల్లూరు జిల్లా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. కేంద్ర సహాయ మంత్రి పదవిని ఎంపీ ఎప్పుడో తిరస్కరించారు.. ఇప్పుడు కొత్తగా వద్దు అనడం ఏమిటనేది మరో వర్గం చెబుతున్న మాట. ఇదంతా ఆ ఎంపీ అనుచరులు పధకం ప్రకారమే ప్రచారం చేయిస్తున్నారనే అనుమానాన్ని టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా భార్యకు మంత్రి పదవి ఇప్పించేందుకే, ఆ ఎంపీ తెర వెనుక నుంచి కొత్తగా ఆడుతున్న నాటకం అనే విమర్శలు వస్తున్నాయి. భార్యను మంత్రి పదవిలో చూడాలన్న కోరిక ఎంపీకి ఉండటంలో తప్పులేదు.

అయితే భార్య ప్రశాంతి రెడ్డి కోసం కేంద్ర సహాయ మంత్రి పదవిని త్యాగం చేశారంటూ సానుభూతి కోసం ఆయనే కొత్తగా నాటకం ప్రారంభించి ఉంటారనే ప్రచారం కూడా ఉంది. అసలు విషయం ఏమిటంటే.. మంత్రి లోకేష్ కోటరీలో నెల్లూరు ఎంపీ ఉన్నారని.. అలాంటప్పుడు ఆయన కోరితే ఆయన భార్యకు లోకేష్ మంత్రి పదవి ఇప్పించకుండా ఉంటారా..! లోకేష్‌కు ప్రస్తుతం ఎంపీ వేమిరెడ్డి అత్యంత నమ్మకస్తుడనే ప్రచారం వుంది. అందుకే సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్, ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గెలిచిన వెంటనే ప్రశాంతి రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ఎంపిక చేశారు కూడా.